భువనగిరి అర్బన్, జనవరి 4 : బ్రెయిలీ లిపిని కనిపెట్టి అంధులకు అక్షర జ్ఞానం ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించారు. లూయిస్ చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి కేక్ కట్ చేసి మాట్లాడారు. లూయిస్ బ్రెయిలీ అసాధారణ ప్రతిభను మనం స్మరించుకోవాలని, ఆరు చుక్కలతో బ్రెయిలీ లిపిని కనిపెట్టి గొప్ప మనిషి అని అన్నారు. బ్రెయిలీ లిపితో నేడు ఎందరో దివ్యాంగులు ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్నారని తెలిపారు. అవయవ లోపం ఉంటే తక్కువ అని భావించవద్దని, ప్రతి ఒక్కరిలో ఏదో ప్రతిభ ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు అన్ని రకాలుగా సహాయపడే టోల్ ఫ్రీ నంబర్ 1800-572-8980 అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సీడబ్ల్యూసీ చైర్మన్ జయశ్రీ, యువజన శాఖ అధికారి ధనంజయ్, ఎఫ్ఆర్ఓ తిరుపతిరెడ్డి, డీసీపీఓ సైదులు పాల్గొన్నారు.