Jana Nayagan |తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సంబంధించిన అనిశ్చితి తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం మొదట జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సర్టిఫికెట్ నిలిచిపోయింది. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం సుమారు 24 కట్స్ సూచించగా, చిత్ర యూనిట్ మార్పులు చేసి మళ్లీ సమర్పించినప్పటికీ తక్షణ స్పందన రాకపోవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
మొదట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు అనుకూల స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ వివాదం మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వెళ్లడంతో అక్కడ విచారణ కొనసాగింది. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్‌కి కొత్త వర్షెన్ సమర్పించి కోర్టు కేసులని ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. మూవీని ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది చూడాలి.‘జన నాయగన్’ సినిమా రాజకీయ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. తెలుగులో ఘన విజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ కథను ఆధారంగా తీసుకుని తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పలు మార్పులు చేసి రూపొందించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు నిర్మించారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ సమకూర్చారు. సెన్సార్ వివాదాలు తొలగి అధికారిక ప్రకటన వెలువడితే ‘జన నాయగన్’ విడుదలపై నెలకొన్న అనిశ్చితి పూర్తిగా తొలగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.