
యాదాద్రి, ఆగస్ట్టు24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్షేత్రానికి పాలకుడిగా విష్ణుపుష్కరిణి చెంత గల గుడిలో హనుమంతుడిని సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పా ల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
వైభవంగా నిత్యపూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యపూజలు సంప్రదాయరీతిలో సాగాయి.
స్వామివారి ఖజానాకు రూ.19,10,064 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.19,10,064 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,28,336, రూ.100 దర్శనంతో రూ. 67,500, నిత్యకైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతంతో రూ.1,100, క్యారీబ్యాగులతో రూ.3,500, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.52,000, కల్యాణకట్టతో రూ.22,000, ప్రసాద విక్రయంతో రూ.3,93,775, శాశ్వతపూజలతో రూ.6,000, వాహనపూజలతో రూ.6,800, టోల్గేట్తో రూ. 900, అన్నదాన విరాళంతో రూ.3,848, సువర్ణ పుష్పార్చనతో రూ.94,220, యాదరుషి నిలయంతో రూ.54,050, పాతగుట్టతో రూ.23,135, ఇతర విభాగాలతో రూ.10,50,300తో కలుపుకొని రూ. 19,10,064 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
31న శ్రీకృష్ణాష్టమి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. 31వ తేదీన శ్రీకృష్ణాష్టమిని నిర్వహిస్తామని, సెప్టెంబర్ 2వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి బాలాలయ ప్రాంగణంలో ఉట్లోత్సవం, రాత్రి 7. 45 గంటలకు రుక్మిణి అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా 31వ తేదీన స్వామివారి మొక్కు, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవా లు, సుదర్శన నారసింహహోమం, ఆన్లైన్ కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్
యాదాద్రి స్వామివారిని మంగళవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రావు సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయరీతిలో వారికి ఘనస్వాగతం పలికారు. బాలాలయం లో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వేదఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఏఈవోలు రమేశ్‌బాబు, శ్రవణ్‌కుమార్ ఉన్నారు.
యాదాద్రి ఆలయ పనుల పరిశీలన
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా ఆయన స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి కొండపైన ఉత్తర ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రహరీ, ఎస్కలేటర్, క్యూకాంప్లెక్స్ తుదిమెరుగుల పనులను పరిశీలించారు. అనంతరం కొండకింద నిర్మితమవుతున్న రింగురోడ్డు సర్కిల్, కల్యాణకట్ట, అన్నదానసత్రం, సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనాలను సందర్శించి పురోగతిపై ఆరా తీశారు.