
భువనగిరి అర్బన్, ఆగస్టు 24: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రావిభద్రారెడ్డి గార్డెన్ లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కమిషన్ సభ్యులు వెళ్లి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
బాలల హక్కుల పరిరక్షణ విష యంలో పోలీసు, విద్యాశాఖల పాత్ర కీలకమని, బాల్యవివాహాల నిర్మూలన, వెట్టిచాకిరీ నుంచి విముక్తి తదితర చర్యలు చేపట్టాలని శ్రీనివాస్‌రావు ఆయా శాఖలకు సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ మాట్లాడుతూ కొవిడ్ వైరస్ ప్రభావంతో గతేడాది పిల్లలకు చాలా నష్టం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలతోపాటు అన్ని స్కూళ్లు, కళాశాలలు మూతబడి విద్యారంగానికి, విద్యార్థులకు నష్టం జరిగిందని, ఈ నష్టా న్ని వీలైనంత త్వరగా పూడ్చాలన్నారు.
బాల అదాలత్‌లో తల్లిదండ్రులు, బాలల సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరిస్తార న్నారు. అనంతరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పిల్లల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సత్వరమే స్పందించి పోలీస్‌శాఖ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ముస్కాన్ ఆపరేషన్ ద్వా రా వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో వెట్టిచాకిరీ నుంచి దాదాపు 300లకుపైగా పిల్లలకు విముక్తి కల్పించామన్నారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ, అంజన్‌రావు, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, బృందాకర్, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఈవో చైతన్యజైనీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, సీడీపీవోలు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి కృషి
బాల అదాలత్ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పమేలాసత్పతి హాజరై మాట్లాడుతూ పిల్లలు తమ సమస్యలను వ్యక్తపర్చలేరని, పిల్లల సమస్యల పరిష్కారానికి కమిషన్ స్పందించి రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. కమిషన్ దృష్టికి వచ్చిన 216 ఫిర్యాదులను పలు శాఖల అధికారు లతో పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు.