
ఆలేరు టౌన్, జూలై 6 : పట్టణ ప్రగతిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. మంగళవారం పట్టణ ప్రగతిలో భాగంగా ఆలేరులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం నిధులు మంజూరై టెండర్లు ఖరారైనప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించలేదని కమిషనర్ లావణ్యలతను ప్రశ్నించారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులకు బయోపెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కలిసి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, తహసీల్దార్ గణేశ్‌నాయక్, కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నర్సింహులుతో పాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలి
చౌటుప్పల్ జూలై 6: పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పాత ఇండ్లను కూల్చివేయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాందుర్గారెడ్డి, కౌన్సిలర్ ఎండీ బాబాషరీఫ్ పాల్గొన్నారు.
దామెరలో..
మండలంలోని దామెరలో నిర్వహించిన పల్లె ప్రగతిలో సర్పంచ్ నారెడ్డి ఆండాలు పాల్గొన్నారు. గ్రామం నుంచి శివారు వరకు పెద్ద మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కోరె ప్రకాశ్, నారెడ్డి అభినందన్‌రెడ్డి, సునీత, సుజాత, రజిత పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
భువనగిరి అర్బన్, జూలై 6 : వార్డుల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 33వ వార్డులో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ….పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. పట్ట ణ ప్రగతిలో గుర్తించిన పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాళాశాల ఆవరణలో 100 మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్లు క్రాంతి అవంచక, ఏవీ కిరణ్ కుమార్, అంద శంకర్, నాయకులు భాషబోయిన రాజేశ్, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, రాచమల్ల రమేశ్ పాల్గొన్నారు.