
యాదాద్రి భువనగిరి, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో మంగళవారం స్వామివారి నిత్యారాధనలు సంప్రదాయంగా జరిగాయి. స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ పంచామృతాలతో అభిషేకించారు. సుదర్శన నారసింహ హోమం నిర్వహించి, నిత్యతిరు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు మహానివేదన, శయనోత్సవం జరిపారు. స్వామి వారి సన్నిధిలోని విష్ణుపుష్కరిణి వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రూ.10,20,223 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.10,20,223 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ .1,23, 088, రూ.100 దర్శనాల ద్వారా రూ.46,600, క్యారీ బ్యాగుల ద్వారా రూ.3వేలు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.42వేలు, కల్యాణ కట్ట ద్వారా రూ.22,300, ప్రసాద విక్రయాల ద్వారా రూ.5,05,950, శాశ్వత పూజల ద్వారా రూ.12వేలు, వాహన పూజల ద్వారా రూ.6,500, టోల్గేట్ ద్వారా రూ.1,140, అన్నదాన విరాళాల ద్వారా రూ.2 5,080, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.90, 940, యాదరుషి నిలయం ద్వారా రూ.60, 480, పాతగుట్ట ద్వారా రూ.18,245, కొబ్బరికాయల విక్రయాలతో రూ.60వేలు, ఇతర విభాగాలతో రూ.2,900 కలుపుకుని రూ.10,2 0,223 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.
15 రోజుల హుండీల ఆదాయం రూ.72,98,806
స్వామివారి 15 రోజుల హుండీల ఆదాయం రూ.72,98,806 వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.72,98,806 వచ్చిందని బంగారం 110 గ్రాములు, వెండి 2 కిలోల 600 గ్రాములు వచ్చిందని తెలిపారు.