యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి);వరి పోరు పతాక స్థాయికి చేరింది. ఈ నెల 4 నుంచి మొదలైన ఉద్యమ పోరు నిరాటంకంగా సాగుతున్నది. ఓ వైపు గులాబీ దళం మరోవైపు రైతాంగం వరి కంకులను చేతబూని ఆందోళన బాట పట్టాయి. ఇదే స్ఫూర్తితో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరగసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నినాదాలతో హోరెత్తించారు. నిరసనలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతల ఉసురు పోసుకుంటే బీజేపీకి పతనం తప్పదని హెచ్చరించారు. రైతులు పండించిన వడ్లు కొనేదాకా సీఎం కేసీఆర్ సారథ్యంలో తమ పోరాటం కొనసాగుతుందని, ఇక ఢిల్లీలోనే అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
వరి పోరు పతాక స్థాయికి చేరింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో ఈ నెల 4న మొదలైన ఉద్యమం నిరాటంకంగా సాగుతున్నది. ఓ వైపు గులాబీ దళం.. మరోవైపు రైతాంగ బలం.. వరి కంకులను చేతబూని ఆందోళన ఉధృతం చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనను హోరెత్తించారు. నిరసనల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాసంగి ధాన్యం కొనేది లేదంటూ మొండికేసిన కేంద్రం మెడలు వంచే దిశగా టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. విజ్ఞప్తులు, విన్నపాలు చేసినా వినకపోవడంతో ప్రత్యక్ష పోరుకు పూనుకుంది. ఐదు రోజులపాటు ఆందోళనలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రైతన్నలతో కలిసి నిరసనలు చేపట్టాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు సమష్టిగా ముక్తకంఠంతో నినదించారు. స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొని తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఆలేరు, భువనగిరిలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పైళ్ల శేఖర్‌రెడ్డి నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి బొమ్మలరామారంలో పార్టీ కార్యకర్త ఇంటిపై నల్లజెండాను ఎగురవేసి నిరసన గళం విన్పించారు.
11న ఢిల్లీ దీక్షకు నేతల సమాయత్తం…
క్షేత్రస్థాయి ఉద్యమాలతో అన్నివర్గాలను సంఘటితపర్చిన టీఆర్ఎస్ ఇక 11న ఢిల్లీలో నిర్వహించే దీక్షపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించే దీక్షలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. జిల్లాలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా దీక్షకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కేంద్రం కచ్చితంగా వడ్లను కొనాల్సిందే
యాసంగిలో పండించిన వడ్లను కేంద్రం కచ్చితంగా కొనాల్సిందే. రా రైస్, బాయిల్డ్ రైస్ అని సాకులు చెప్పి నరేంద్ర మోదీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఢిల్లీలో లొల్లి చేయడానికైనా వెనుకాడేదిలేదు. కేంద్రం వరి కొనమని ఎన్నిత్తులు వేసినా ఉద్యమాలు ఆగవు.
– ఓరుగంటి విఠల్, రైతు, తాజ్పూర్, భువనగిరి మండలం