నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి
మోత్కూరు, ఏప్రిల్ 8 : పాడి రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించనున్న రూ.35కోట్ల పెండింగ్ బిల్లులు ఈ నెలాఖరులోగా చెల్లింపునకు కృషి చేస్తున్నట్లు నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు. మోత్కూరులోని పాల శీతలీకరణ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 2019 జనవరి 1నుంచి మార్చి 31 2022వరకు పాల సొసైటీల్లో పాలు పోసిన ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4చొప్పున ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని చెల్లించాలని పాల ఉత్పత్తి సొసైటీల చైర్మన్లను కోరారు. పాడి రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పించేందుకు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో సీఎం కేసీఆర్‌ను పలుసార్లు కలిసి విన్నవించామని తెలిపారు. ఈ నెలాఖరులోగా బకాయిలు పూర్తిగా చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా మార్చి నెల బిల్లులు సైతం రెండు, మూడు రోజుల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. బిల్లుల చెల్లింపులు సకాలంలో జరుగక సొసైటీల్లో పాలు పోసే రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు వెళ్తున్నారన్నారు.
మదర్ డెయిరీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణానికి చర్యలు
మదర్ డెయిరీ పరిధిలోని నల్లగొండ, తాండూరు, మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రాల్లో ఉన్న విలువైన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు. మదర్ డెయిరీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడంతో పాటు, రైతుల బిల్లులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు శీతలీకరణ కేంద్రాల్లో వనరులు వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎండీ.అశోక్, డీజీఎం కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, పాల సొసైటీల చైర్మన్లు పుచ్చకాయల నర్సిరెడ్డి, కొత్తకొండ నరేందర్, పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ భాస్కర్, రైతులు పాల్గొన్నారు.