తుర్కపల్లి, మార్చి 22 : నీటి సంరక్షణపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని నోవార్తీస్ ప్రతినిధి లోకేశ్ మణికొండ, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ డైరెక్టర్ ఆర్వీ మురుగన్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని మాదాపురం రైతువేదిక భవనంలో కమ్యూనిటీ వాటర్‌షెడ్డు ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోవార్తీస్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని మాదాపురం, ధర్మారం, రామోజీనాయక్‌తండా, ముల్కలపల్లి గ్రామాల అభివృద్ధితోపాటు నీటి నిల్వలను పెంపొందించేందుకు వాటర్షెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకం, మహిళలకు ఆర్థిక చేయూతతోపాటు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో నీటి నిల్వలను పెంపొందించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ చేపడుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యేటా ఒక జిల్లాను ఎంపిక చేసుకొని ఆ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో తమ ఫౌండేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈసారి తుర్కపల్లి మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన గ్రామాల ప్రజలు తమకు సహకరించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ, పాఠశాలల విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. నోవార్తీస్ ప్రతినిధి వైశాలి అయ్యర్, సుధీర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామసుబ్రహ్మణ్యం, జాయింట్ డైరెక్టర్ కుమారవేణు, మారెట్కా, శశిధరన్, విజయసుందర్, రాజేశ్, సర్పంచులు పోషమణి, శారద, మల్లప్ప పాల్గొన్నారు.