మోటకొండూర్ : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ కలిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. గురువారం మోటకొండూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళ సమాఖ్య భవనం ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు, నూతన పాలక కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో గ్రామ పంచాయతీ నిర్మాణానికి స్థలాన్ని అందించిన దాతల సేవలు అభినందనీయమన్నారు. గ్రామ పంచాయతీ భవనానికి స్థలాన్ని కేటాయించిన దాతలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 490 పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకువచ్చి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ గ్రామాలకు అధిక నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తుందని.. రాష్ట్రంలో అందరి అభివృద్ధే సీఎం కేసీఆర్ కర్తవ్యమన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ చొప్పరి మాధవి, పాలకవర్గం సభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడిని ఘనంగా సన్మానించారు.
ముదిరాజు సంఘం భవనం ఏర్పాటు చేయిస్తాం..
గ్రామంలో అధిక జనాభా కలిగిన ముదిరాజు కులస్తుల సంక్షేమం కోసం ముదిరాజు సంఘం భవనం ఏర్పాటు చేయిస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామంలో సుమారు రూ. 40లక్షలతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపడతామన్నారు. గ్రామం నుంచి చిన్నకందుకూరు మీదుగా జాతీయ రహదారి వరకు రోడ్డు మంజూరీ చేయాలని జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి కోరగా తప్పనిసరిగా రోడ్డుకు నిధులను మంజూరీ చేయించి, త్వరలోనే పనులకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ చొప్పరి మాధవి, ఎంపీపీ పైళ్ల ఇందిరా సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, మోటకొండూర్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, మధర్డైయిరీ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ పల్లా జోగ్గిరెడ్డి, ముదిరాజు సంఘం గ్రామ అధ్యక్షుడు మారయ్య, రైతు బంధు కన్వీనర్ ఐలయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బైరోజు వెంకటచారి, తదితరులు పాల్గొన్నారు.