
యాదాద్రి, జూన్27: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. వందలాది మంది భక్తులు సత్యనారాయణస్వామి వారి వ్రతపూజలు ఆచరించేందుకు తరలిరావడంతో మండపాలు భక్తులతో పోటెత్తాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సడలింపు అనంతరం మొదటిసారి వారాంతపు సెలవురోజు కావడంతో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపై తిరువీధులన్నీ నిలబడటానికి సందులేనంతగా కిటకిటలాడాయి. నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణం, సుదర్శనహోమం, పూజా కైంకర్యాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు చెప్పారు. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించలేదు. ఆలయానికి వెళ్లే రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆర్జిత పూజలు కోలాహలం తెల్లవారు జాము 3 గంటల నుంచి మొదలైనది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.
వైభవంగా వ్రత పూజలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సామూహిక సత్యనారాయణస్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. పెద్దఎత్తున భక్తులు సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న సమాచార శాఖకమిషనర్, ఐఎఫ్ఎస్ అధికారులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణాలు మహాద్భుతంగా జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు సభ్యులు, ఐఎఫ్ఎస్ అధికారి డి.నలిని మోహన్ కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.20,49,662 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.20,49,662 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ. 2,98,754 రూ. 100 దర్శనం తో రూ.25,200, వీఐపీ దర్శనాలతో రూ. 2,85,000, నిత్యకైంకర్యాలతో రూ.200, సుప్రభాతం ద్వారా రూ.1,200, క్యారీబ్యాగులతో రూ. 4,900, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ. 79,500, కల్యాణకట్టతో రూ. 46,880, ప్రసాద విక్రయంతో రూ.7,91,540, శాశ్వతపూజల ద్వారా రూ.55,812, వాహనపూజలతో రూ. 14,700, టోల్గేట్తో రూ. 1,810, అన్నదాన విరాళంతో రూ.1,12,911, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,26,860, యాదరుషి నిలయంతో రూ. 85,880, పాతగుట్టతో రూ. 60,945, టెంకాయల విక్రయాలతో రూ. 57,570తో కలుపుకొని రూ.20,49,662 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.