
గుండాల, జూన్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధమయ్యాయి. అడవుల శాతాన్ని పెంచాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గుండాల మండల వ్యాప్తంగా 20 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేశారు. 20 గ్రామాల్లో కలిపి మొత్తం 2లక్షల 68 వేల మొక్కలను అధికారులు సిద్ధం చేశారు. నర్సరీల్లో జామ, టేకు, దానిమ్మ, బొప్పాయి, ఉసిరి, సీతాఫలం, కానుగు, వేప, చింత, ములగ, నందివర్ధనం, గులాబి, గన్నేరు, టేకోమా, తులసి, మందార, మల్లే, గోరింటాకు మొక్క, పారిజాతం తదితర పండ్ల, పూల జాతి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. 7వ విడుత హరితహారాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారుల సూచనల మేరకు మొక్కలను సిద్ధం చేసినట్లు మండల అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో 10వేల మొక్కల చొప్పున 2 లక్ష మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మిగిలిన మొక్కలను గ్రామాల్లో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్, ఉపాధిహామీ అధికారులు గ్రామాల్లో మొక్కలు పెంచడానికి ఇప్పటికే అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. జిల్లా అధికారుల ఆదేశాలతో ఇప్పటి వరకు సుమారుగా 20వేల గుంతలు తీయించారు. ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఇనిస్టిట్యూట్లలో, పల్లెప్రకృతి వనాల్లో, చెరువుల్లో తుమ్మ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నర్సరీలపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలపై మండలస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఉపాధిహామీ ఈసీ వినోద్‌కుమార్, టీఏలు సోమయ్య, పల్లవి, కృష్ణ, మత్స్యగిరి, పంచాయతీ కార్యదర్శులు నిరంతరం నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకంపై వన సేవకులకు, ఉపాధిహామీ కూలీలకు పలు సూచనలు చేస్తున్నారు.
నర్సరీలపై ప్రత్యేక దృష్టి..
ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలపై గ్రామపంచాయతీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెట్లను పెంచాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను గ్రామపంచాయతీలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు నర్సరీలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నర్సరీల్లో పనిచేసే వన సేవకులు, వాటర్మెన్లతో మొక్కలకు నీరు పట్టించడం, కలుపు తీయించడంతో పాటుగా వాటి సంరక్షిస్తున్నారు.