రామగిరి, ఫిబ్రవరి 10 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయకుండా బీఆర్ఎస్వీ నాయకుడు వాడపల్లి నవీన్‌పై వర్సిటీ అధికారులు నిషేధం విధించారు. వర్సిటీ సమస్యలతో పాటు హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, అలాగే సిలబస్ పూర్తి కాకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా నవీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ ఇటీవల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా వర్సిటీ అధికారులు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపారు. మంగళవారం పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
పరీక్ష రాసేందుకు వచ్చిన నవీన్‌ను ప్రొఫెసర్లు అనుమతించలేదు. దీనిపై వివరణ కోరగా నిర్ధేశిత హాజరు శాతం (75 శాతం) లేనందున పరీక్షలకు అనుమతించడం లేదని వెల్లడించారు. అయితే హాజరు శాతం తక్కువ ఉంటే పరీక్ష ఫీజు కట్టుకోరని, తన నుండి ఫీజు స్వీకరించి ఇప్పుడెలా పరీక్షలు రాయకుండా నిరాకరిస్తారని నవీన్ ప్రశ్నించాడు. విద్యార్థుల తరఫున మాట్లాడినందుకు, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసినందుకు కక్షసాధింపుతో తనపై ఈ విధమైన చర్యలు తీసుకోవడం సరైంది కాదని, ఇది విద్యార్థి హక్కుల ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు.