
యాదాద్రి భువనగిరి, జూలై 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నాయి. గత ఐదు రోజులుగా చేపట్టిన ‘ప్రగతి’ కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు మెరుస్తున్నాయి. పారిశుధ్యం, హరితహారం, విద్యుదీకరణ వంటి లక్ష్యాలతో పది రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మమేకం కాగా.. ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులవుతున్నారు. అయితే సోమవారం ప్రత్యేకించి అధికార యంత్రాంగం ‘పల్లె నిద్ర’ కార్యక్రమానికి ఉపక్రమించింది. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు మండల ప్రత్యేకాధికారులుగా నియమించబడ్డ జిల్లాస్థాయి అధికారులు వారికి నిర్దేశించిన మండలాల్లో ‘పల్లె నిద్ర’ చేశారు. ఈ మేరకు కలెక్టర్ పమేలాసత్పతి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లాస్థాయి మొదలుకుని మండల, గ్రామస్థాయి అధికారులు సైతం ‘పల్లె నిద్ర’లో పాలుపంచుకున్నారు.
ఎవరు ఎక్కడంటే…
యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబాతో కలిసి ‘పల్లె నిద్ర’ చేశారు. స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామంలో డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో జిల్లా సివిల్ సైప్లె అధికారి గోపీకృష్ణ, ఆత్మకూరు మండలం పల్లెర్లలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బాల్సింగ్, సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి మాన్య నాయ క్, మోత్కూరు మండలం దాచారంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, రాజపేట మండలం నరసాపురం గ్రామంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, అడ్డగూడూరు మం డలం చిన్నపడిశాలలో పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి కృష్ణ, బొమ్మలరామారం మండలం జలాల్పూర్ గ్రామంలో భూగర్భ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర జ్యోతిక కుమార్, తుర్కపల్లి మం డలం మల్కాపురంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, వలిగొం డ మండలం ఎదుల్లగూడెంలో డీఎల్పీవో సాదన, వీరితోపాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర మండల, గ్రామస్థాయి అధికారులు ‘పల్లె నిద్ర’లో పాల్గొన్నారు.