– ఐద్వా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
భువనగిరి అర్బన్, జూలై 21 : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను తక్షణమే అమలు చేయాలని ఐద్వా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి 33 శాతం మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ సీత, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లును వెంటనే ఆమోదించి అమలు చేయాలని కోరారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో మహిళా రిజర్వేషన్ అమలును ముడిపెట్టడం తగదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే మహిళా రిజర్వేషన్ చట్టం–2023ను ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని, చట్టంలో పొందుపరిచిన 15 సంవత్సరాల గడువు నిబంధనను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు సుగుణ, ఐద్వా జిల్లా కమిటీ పట్టణ అధ్యక్షురాలు మాయ రాణి, ఎన్ పి ఆర్ డి జిల్లా నాయకురాలు కొత్త లలిత, జిల్లా నాయకులు గంధమల్ల బాలమణి, గడ్డం పద్మ, లక్ష్మీ నర్సమ్మ, కొమ్మిడి లత, అంబటి లలిత, అండాలు పాల్గొన్నారు.