యాదగిరిగుట్ట, ఏప్రిల్ 04 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. స్వామివారి దివ్యక్షేత్రాన్ని రూ.1,300 కోట్లతో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించారు. ఆలయంతో పాటు పరిసరాల పనులు 90 శాతం పూర్తికాగా మిగతా 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కొండపైకి వెళ్లేందుకు ఎంట్రీ ఫ్లై ఓవర్ గండిచెరువు సుందరీకరణ, కొండకింద దేవస్థాన బస్టాండ్, దేవస్థానం ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలు, పెద్దగుట్ట నుంచి కొండపైకి రోప్ వే, కొండకింద కల్యాణకట్ట వద్ద సీఆర్. రారా క్లాక్ రూమ్, రాయగిరి నుంచి కొండపై వరకు ఇజ్రాయెల్ సాంకేతితను జోడిస్తూ సౌండ్ సిస్టంతో కూడిన కెమెరాలు, మెట్లదారి నుంచి వచ్చే భక్తులను గుర్తించే వ్యవస్థను గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం నిధులను సైతం కేటాయించింది. కొండపైన ప్రతి భక్తుడిని లెక్కగట్టేందుకు ఫ్లాప్ బారియర్స్ ఏర్పాటు చేసినా దీనిని వాడుకలోని తీసుకురావడం లేదు. కొండపైన ఎలాంటి భవన నిర్మాణాలుండొద్దని, లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయాన్ని సువిశాలంగా తీర్చిదిద్దారు. భక్తులు రోజుకు 50 నుంచి 80 వేల మంది దర్శించుకుంటున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విముఖత చూపుతోందని భక్తులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికి రూ.380 కోట్లు నిధులు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో సైతం నిధుల కేటాయింపును విస్మరించింది.
కాళేశ్వరం 10 ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న నృసింహస్వామి జలాశయం నుంచి డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా గండి చెరువులోకి గోదావరి జలాలను నింపిన అప్పటి కేసీఆర్ సర్కార్ స్వామివారి తెప్పోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించింది. భక్తులకు ఆధ్యాత్మికతో పాటు మానసిక ఉల్లాసం కలిగించేలా గండి చెరువు పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం వైటీడీఏ నిధుల కింద రూ.33.70 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణ గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. చెరువు చుట్టూ 2 నడక దారులు నిర్మించారు. భక్తులు కాలినడకన గండి చెరువు చుట్టూ తిరుగుతూ సేదతీరే వీలుగా నిర్మాణాలు సాగాయి. గండిచెరువు చుట్టూ 1,000 మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పులో లాండ్ స్కేపింగ్ గార్డెన్లు నిర్మిస్తుండగా పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి.
పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటారు. చెరువు చుట్టూ పంచనారసింహుడి విగ్రహాలను అమర్చారు. దాదాపుగా పనులు పూర్తయినా మిగతా మరో 20 శాతం పనులు ఫెండింగ్‌లో ఉన్నాయి. తెప్పోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు పెండింగ్‌లో పెట్టారు. గత ప్రభుత్వం ప్రతిపాధించిన హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్ తరహాలో గండిచెరువు ప్రవేశ ద్వారం వద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్‌ను నిర్మించాల్సి ఉంది. మ్యూజికల్ జెట్ వస్తూ అధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తి సంగీతం భక్తులను ఆకట్టుకుంటుంది. పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయాల్సి ఉంది. గండి చెరువుకు వెళ్లేందుకు ఇప్పటికే రింగురోడ్డు పూర్తై అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే టెంపుల్ సిటీపై 250 డోనర్ కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించి ఇందుకు అనుగుణంగా లే అవుట్, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. నిర్మాణాలకు డోనర్లు సైతం మందుకువచ్చినా కాటేజీల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం పెదవి విప్పడం లేదు.
స్వామివారి దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి భద్రతను కల్పించేందుకు ఇజ్రాయిల్ దేశం నుంచి ప్రత్యేకమైన అధునాతన విద్యుద్దీపాలను యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో బిగించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రాయగిరి నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం, టెంపుల్ సిటీ, రింగురోడ్డుతో పాటు గుట్ట చుట్టూ సుమారు 5.7 కిలోమీటర్ల మేర 200 మీటర్ల దూరంలో ఒక్కో విద్యుద్దీపాన్ని అమర్చాల్సి ఉంది. ఇందులో సీసీ కెమెరాతో పాటు సౌండ్ సిస్టం సైతం రావడంతో స్వామివారి నిత్య కైంకర్యాలు సౌండ్ సిస్టం ద్వారా రాయగిరి వరకు భక్తులకు వినిపిస్తాయి. సుస్పష్టమైన సీసీ కెమెరా ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. భక్తుడికి ఏదైనా సమస్య వాటిల్లితే ఈ కెమెరా వద్దకు వచ్చి హెల్ప్, హెల్ప్ అని చెబితే చాలు నేరుగా కమాంగ్ కంట్రోల్ కు సమాచారం వెళ్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై భక్తుడికి అందుబాటులోకి వస్తారు. ఒకవేళ ఎక్కడైన లైట్ పాడైపోతే వెంటనే కమాండ్ కంట్రోల్ కు తెలిసిపోతుంది. సాయంత్రం కాగానే లైట్లు వాటంతటవే వెలుగుతాయి. ఉదయం సూర్యోదయ సమయంలో స్వయంచాలకంగా బంద్ అయిపోతాయి. ఇలాంటి అదునాతన సాంకేతితను వినియోగించాలని గత ప్రభుత్వం భావించినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెడచెవున పెట్టింది.
యాదగిరిగుట్ట వచ్చే భక్తులపై ప్రత్యేకమైన నిఘా ఉండాలనే ప్రతిపాదన గత ప్రభుత్వానిది. లగేజీ, వాహనాల్లో బాంబు, ఇతర పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు అత్యాధునిక బామర్స్, లగేజీ, వాహనం స్కానర్లు, ఫ్లాట్ బారియర్స్, డీఎఫ్ఎండీలను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు వెళ్లే ఫ్లై ఓవర్, మాదరోడ్లు, బస్ బే వద్ద గల ప్రవేశ ద్వారాల వద్ద అమర్చి ప్రతి వాహనాలను తనిఖీ చేస్తే బాగుటుందని బావించినా ప్రస్తుత ప్రభుత్వం ఆచరణలో పెట్టడం లేదు. ప్రతి భక్తుడికి క్యూఆర్ కోడ్‌తో దర్శనం చేసుకునే విధంగా, నడుచుకుంటూ వచ్చే భక్తులకు వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేకమైన రిసెప్షన్‌ను ఏర్పాటు చేసి అక్కడే క్యూఆర్ కోడ్‌ను భక్తులకు అందజేయాలన్నది మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం, యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు తిరుమల తరహాలో ఆన్లైన్ ద్వారా టికెట్ వ్యవస్థను దాదాపుగా పక్కన పెట్టారు.
కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న నెట్వర్క్ బ్రిడ్జి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. గత కేసీఆర్ సర్కార్ ప్రతిపాదించి నిధులు కేటాయించి పనులను మొదలు పెట్టినా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైకి వెళ్లి తిరిగివచ్చేందుకు రూ.32 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టగా, ఎగ్జిట్ ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి గత ప్రభుత్వమే తీసుకువచ్చింది. కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా లండన్ నుంచి నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జికి సంబందించిన విడి భాగాలు దిగుమతి చేశారు. ఆర్యవైశ్య పత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్‌రోడ్డు, నిత్యన్నదాన భవనం వరకు ఫ్లై ఓవర్ ను అనుసంధానం చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ను 7 ఫిల్లర్లతో నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపుగా 35 శాతం పనులు పూర్తయినా మిగతా 15 శాతం పనులు పూర్తి చేస్తే బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది.
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను లెక్కించేందుకు గత ప్రభుత్వం ఇజ్రాయిల్ సాంకేతికతతో కూడిన ”ఫ్లాప్రియర్స్” భక్తుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు అటోమేటెడ్ యాక్సెస్ కంట్రోల్ పరికరం. ఆలయం పునః ప్రారంభం అనంతరం కొండపైన క్యూ కాంప్లెక్స్, లడ్డూ ప్రసాద విక్రయశాల, తూర్పు రాజగోపురంతో పాటు పశ్చిమ రాజగోపురం వద్ద ఈ కెమెరాలను బిగించారు. భక్తుల ముఖాలను స్క్రీన్ చేసి కంట్రోల్ రూంలోకి అందిస్తుంది. దీంతో రోజుకు ఎంత మందికి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారో చెప్పేందుకు వీలు ఉంటుంది. కానీ ఈ కెమెరాలను వినియోగించడం లేదు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొండకింద ఉత్తర భాగంలో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగుతారు. అక్కడే కల్యాణ కట్ట, శ్రీలక్ష్మిపుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడే భక్తులకు అన్ని టికెట్లను విక్రయించే విధంగా కొండకిండ సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడే స్వామివారి వీవీఐపీ దర్శనం బ్రేక్ దర్శనం, ప్రసాదాలు, రూ.150 దర్శనం, ఆర్జిత పూజలైన సుప్రభాత సేవ, సహస్రనామార్చనలు, నిజాభిషేకం, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వెండి మొక్కు జోడు సేవతో పాటు ఇతర స్వామివారి భక్తులచే జరుపబడే పూజలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లను విక్రయించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సీఆర్ఓ కార్యాలయం నిర్మించాలన్న ఆలోచనే చేయడం లేదు.
గత ప్రభుత్వ హాయాంలో గుత్తేదారులకు ఇవ్వాల్సిన నిధులు రూ.380 కోట్లు పెండింగ్ ఉండగా నిధుల విడుదలలో ప్రభుత్వం ఆలసత్వం వహిస్తోంది. దీంతో పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. వేగేష్నా ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన నిత్యన్నదాన సత్రం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. అభివృద్ధిలో భాగంగా స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు ఇరువైపులా దుకాణాలు కోల్పోయిన వారికి కొండకింద కల్యాణకట్ట వద్ద సుమారు 139 నిర్మించగా 53 మంది లబ్దిదారులకు ప్రొసిడింగ్ లు అందజేయగా వినియోగంలోకి వచ్చాయి. మిగతా వాటికి కనీస వసతులు కల్పించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొండకింద పార్కింగ్ ప్రాంతంలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్మిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సైతం వైటీడీఏ సిద్ధం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కొండకింద బస్టాండ్ కు పక్కనే కొండపైకి వెళ్లేందుకు వైటీడీఏ ఆధ్వర్యంలో రూ. 8.78 కోట్లతో ప్రాంగణ నిర్మాణం దాదాపుగా చివరిదశలోకి వచ్చింది. మిగతా పనులను పూర్తి చేసి ప్రారంభించాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం లేదు. కొండపైకి వెళ్లే భక్తులకు కేసీఆర్ సర్కార్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. కొండకింద బస్టాండ్ వద్ద ఎక్కిన ప్రతి భక్తుడికి కొండపైకి ప్రయాణం ఉచితం. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు ఈ బాధ్యతలను అప్పగించింది. నెలకు సుమారుగా రూ.కోటి నుంచి కోటిన్నర వరకు దేవస్థానం చెల్లిస్తోంది. రాబోయే రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలోనే బస్సులు వేసి ఉచిత ప్రయాణం కల్పించాలని గత కేసీఆర్ సర్కార్ సంకల్పింది. ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించి తొలి విడతగా 40 నుంచి 50 బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ సైతం ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బస్సుకు ఇచ్చే నెలవారి కిరాయితోనే దేవస్థానం బస్సులు కొనుగోలు చేయవచ్చు, ఖర్చు సైతం తక్కువగానే వస్తోందని దేవస్థాన అధికారులు తెలుపుతున్నారు.