యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం పత్తాలేదు. సకల హంగులు, అత్యాధునిక వసతులతో నిర్మిస్తామన్న స్టేడియం ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటి వరకు స్టేడియం మంజూరే కాలేదు. ఇది అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే కదలిక వస్తుందని
అధికారులు చెబుతున్నారు.
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాయగిరిలో ముత్తిరెడ్డి గూడెం వెళ్లేదారిలో ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి సర్కారు ఆమోద ముద్ర వేసింది. రాయగిరిలోని సర్వే నంబర్ 259లో పదెకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 18న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జీవో నంబర్ 165 విడుదల చేశారు.
మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో ఎకరాకు రూ. 95లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితోపాటు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఇంత వరకు బాగానే ఉన్నా తదుపరి కార్యాచరణ మాత్రం ముందుకు సాగడంలేదు. స్టేడియం నిర్మాణం కోసం భూకేటాయింపులు జరిగి 8 నెలలు దాటినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఇంకా స్టేడియమే మంజూరు కాలే..
భూ కేటాయింపులు జరిగినా.. స్టేడియం నిర్మాణానికి ఇప్పటి వరకు అసలు ఎలాంటి మంజూరు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఖేలో ఇండియా కింద నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే విడుతల వారీగా స్టేడియాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడుతగా రూ. 33.5 కోట్లు అవసరం పడనున్నాయి. డీపీఆర్ తయారీ కోసం హైదరాబాద్కు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి.. ఉన్నతాధికారులు పంపించారు. ప్రభుత్వం సైతం ఖేలో ఇండియా కింద నిధులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. కేంద్ర నిధులు వస్తేనే స్టేడియం మంజూరు, ఇతర పనులు ముందుకు సాగనున్నాయి. రాష్ట్ర సర్కారు సైతం నిధులు తెప్పించడంలో చొరవ చూపించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
రాయగిరిలో స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది. కానీ ఇప్పటివరకు ఏర్పాటుకు మంజూరు ఉత్తర్వులే విడుదల చేయలేదు. ఇక్కడ స్టేడియం ఏర్పాటైతే ఎంతోమంది క్రీడాకారులకు ప్రయోజనం చేకూరుతుంది. వీలైనంత త్వరగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.