యాదాద్రి భువనగిరి, జూన్ 04 : సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తుర్కపల్లి మండల పర్యటనకు వచ్చే సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుర్కపల్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అవకాశం కల్పించాలని, లేకుంటే రేవంత్ రెడ్డిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సభా స్థలం వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయని, రహదారులను నిర్భందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లుల విషయంపై ముఖ్యమంత్రిని అనేకసార్లు కలిసి విన్నవించగా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికీ దాదాపు రూ.1000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల బిల్లులు ఇచ్చినట్టుగా తప్పుడు ప్రకటన చేసి సర్పంచులను అయోమయానికి గురి చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ నాయకులు వీరబోయిన గణేశ్, మహేందర్‌రెడ్డి, చోల్లేరు బీరప్ప, మదనపల్లి మాజీ సర్పంచ్ పండరి, పారుపల్లి మాజీ సర్పంచ్ స్వరూప, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.