యాదగిరిగుట్ట, మార్చి21 : రాబోయే 25 ఏళ్ల పాటు కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని తీసుకు వస్తామని బీఆర్ఎస్ కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు. గత రెండు ఒప్పందాలను ఏరీతిలో సాధించామో ఆదేస్థాయిలో 3వ ఒప్పందాన్ని కూడా యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీ లిమిటెడ్(పీఈఎల్) బీఆర్ఎస్ కేవీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దఫాలుగా ఏ కార్మిక సంఘం సాధించలేని విధంగా గొప్ప వేతన ఒప్పందాన్ని తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ కేవీ దేనని అన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.80 లక్షల నష్ట పరిహారంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాన్ని సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా యాజమాన్యాన్ని ఒప్పించి ఇంత పెద్ద ఎత్తున్న నష్టపరిహారాన్ని ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ కేవీకే దక్కుతుందన్నారు. కంపెనీ అభివృద్ధికి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని అన్నారు.
2023 ఆగస్టు నెలలో చంద్రుడిపైన అడుగిడిన చంద్రయాన్-3 విక్రం ల్యాండర్లో ఉపయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3లో ఎస్-200 బూస్టర్న్ పీఈఎల్ కంపెనీ కార్మికుల పాత్ర కీలకంగా ఉందన్నారు. 2007లో ఇస్రో చేసిన ఎన్నో ప్రయోగాలకు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్న్ అందించేందుకు ఇక్కడి కార్మికులు కృషి చేశారన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో నిమగ్నమైన పీఈఎల్ కార్మికులకు అండగా నిలువాలన్నదే బీఅర్ఎస్ కేవీ లక్ష్యమన్నారు. ఈ నెల 29వ తేదీన జరిగే కంపెనీ అధికారిక కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ తో కలిసి పోటీలో దిగుతున్నట్లు తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ కేవీలో 140 మంది కార్మికులు, బీఎంఎస్లో 93 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు. రెండు కార్మిక సంఘాలను కలుపుకుంటే మెజారిటీ కార్మికులు బీఆర్ఎస్ కేవీ పక్షాన్నే ఉన్నట్లు వెల్లడించారు. కార్మికులు విజ్ఞతతో ఆలోచించి అండగా నిలిచే బీఆర్ఎస్ కేవీకి అండగా నిలువాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బాణం” గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ కేవీ విజయం లాంఛనమేనని గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. గత రెండు ఒప్పందాలను చూసిన కార్మికులు తమకే మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కేవీ పీఈఎల్ విభాగం జనరల్ సెక్రటరి బరిగేల నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, ఉప కార్యదర్శి పాపయ్య, ఉపాధ్యక్షుడు గట్టికొప్పుల లక్ష్మీనర్సయ్య, కోశాధికారి గవ్వల రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్సరి శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ. నాయకులు గుండ్లపల్లి వెంకటిక్ గౌడ్, సీస రమేశ్ తో పాటు 138 మంది బీఆర్ఎస్ కేవీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.