బొమ్మలరామారం, జూన్ 05 : ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం జరిగే ముఖ్యమంతి రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కోశాధికారి పూడూరి నవీన్ గౌడ్, కార్యదర్శి మేడబొయిన గణేశ్ తెలిపారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం మాజీ సర్పంచుల సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకునేందుకు సర్పంచులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రూ.130 కోట్లు రిలీజ్ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు ప్రచారాలు కొనసాగిస్తుందన్నారు. బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో సర్పంచులకు మరిన్ని అప్పుల పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడదల చేయాలని, లేనియెడల సర్పంచులు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గోవింద్ గౌడ్, శ్రీనివాస్, దామోదర్, శ్రీను నాయక్, వెంకటేశ్ పాల్గొన్నారు.