చౌటుప్పల్, ఆగస్టు 23 : విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ అన్నారు. శనివారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, స్థానిక ఏసీపీ పి.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో పట్టణ కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహిళ సాధికారత అభివృద్ధి కేంద్రం వారి సహకారంతో విద్యార్థులకు సైబర్ క్రైమ్, ఇతర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు టెక్నాలజీని తప్పుగా వాడకూడదన్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని, గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో చాట్ చేయొద్దన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన చాక్లెట్స్ గాని, స్వీట్స్ గాని తీసుకోవద్దని చెప్పారు.
అలాంటి వ్యక్తుల బైకులపై ప్రయాణం చేయవద్దన్నారు. షీ టీమ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితిలో సైబర్ క్రైమ్ 1930, డయల్ 100 నంబర్, మహిళలు 181 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణలో చదువుకుని కళాశాలకు, ఉన్న ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ భార్గవ్, మహిళ సాధికారత అభివృద్ధి కౌన్సిలర్ కో ఆర్డినేటర్ శ్రీవాణి, డెస్క్ ఆఫీసర్ ప్రియాంక, కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ సిలివేరు శ్రీనివాస్, శ్రీ చైతన్య పారా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.