ఆత్మకూరు(ఎం), జూన్ 30 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలపునిచ్చారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల పీఏసీఎస్ డైరెక్టర్ నార్కట్‌పల్లి మల్లమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నార్కట్‌పల్లి స్వామితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం యాదగిరిగుట్టలో గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారంతా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగక ముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలంతా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. అధికారాన్ని చేజిక్కించేందుకు అలవి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా, రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు.
పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు రూ.2,500, యువతులకు స్కూటీ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, మోసపూరిత హామీలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొప్పుల హరిదీప్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య యాదవ్, జిల్లా నాయకులు కోరే భిక్షపతి, యాస ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్ రెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు శంతన్, పీఏసీఎస్ డైరెక్టర్లు పంజాల వెంకటేశ్ గౌడ్, పుట్ట నిర్మల నర్సిరెడ్డి, రామచంద్రయ్య, శ్రీరాములు, కూరెళ్ల గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు స్వామి గౌడ్, అశోక్ పాల్గొన్నారు.