న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జాతీయ రహదారి ఆస్తుల నగదీకరణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరోసారి సిద్ధమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లలో 310.35 కిలోమీటర్ల పొడవున ఉన్న రెండు హైవే సెక్షన్ల కోసం నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్స్ (ఎన్హెచ్ఐటీ) రూ.6,220.90 కోట్లను ఆఫర్ చేసింది. దీనికి ఎన్హెచ్ఏఐ అంగీకరించినట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జాతీయ రహదారుల ఆస్తుల నగదీకరణ ద్వారా దాదాపు రూ.28,077 కోట్లను ఎన్హెచ్ఏఐ సమీకరించిన విషయం తెలిసిందే. కాగా, తాజా డీల్లో మహారాష్ట్రలోని జాతీయ రహదారి 53పై 255.97 కిలోమీటర్ల పొడవున ఉన్న అమరావతి-చిఖిలీ-టార్సోడ్ సెక్షన్, ఏపీలోని జాతీయ రహదారి 16పై 54.38 కిలోమీటర్ల పొడవున ఉన్న గుండుగొలను-చిన్న అవుతపల్లి సెక్షన్లు సేల్ అవుతున్నాయి.
ఇదిలావుంటే ఎన్హెచ్ఐటీ అనేది ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్). దీన్ని ఎన్హెచ్ఏఐ స్పాన్సర్ చేస్తున్నది. ఎన్హెచ్ఐటీ ద్వారా జరిగిన మొత్తం ఆస్తుల నగదీకరణ విలువ రూ.49,858 కోట్లుగా ఉన్నది. ఎన్హెచ్ఐటీ యూనిట్లు దేశీయ ప్రధాన స్టాక్ మార్కైట్లెన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదైయ్యాయి. ఇదిలావుంటే పర్యావరణ ఒత్తిడిని తగ్గించేందుకు దేశంలోని జాతీయ రహదారుల పొడవున బీ కారిడార్లను ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేయనున్నది. తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాల సాయంతో ఏడాదంతా జాతీయ రహదారుల వెంబడి పచ్చదనం, పూలమొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టనున్నామని మంగళవారం ఓ అధికారిక ప్రకటనలో కేంద్రం వెల్లడించింది.