రాజపేట, మార్చి 15 : సూర్యాపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. శనివారం రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సెషన్ కాలం మొత్తం జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ తగదన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ప్రశ్నించే ఒక్క గొంతుకను కూడా నొక్కేస్తూ సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది ఏమాత్రం కూడా సమర్థవంతమైన నిర్ణయం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార ధోరణి బహిర్గతమైందన్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకుడు ఎర్రగోకుల జస్వంత్ పాల్గొన్నారు.