బీబీనగర్, ఏప్రిల్ 18 : బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు, డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రికార్డుల నిర్వహణ విధానం, నిబంధనల అమలుపై సమగ్రంగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గతంలో ఏసీబీ అధికారుల దాడులు, ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల సోదాల నేపథ్యంలో కార్యాలయం పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు అప్రమత్తమై తమ దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సోదాల్లో ఎఫ్ఆర్ఓ మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.