భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 05 : సోషల్ మీడియాలో మహిళపై అసభ్య వీడియో పోస్ట్ చేసిన మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లికి చెందిన ఏనుగు జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంధువులు శనివారం భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. రేవనపల్లికి చెందిన ఏనుగు జైపాల్ రెడ్డి అతడి తండ్రి ఏనుగు స్వామి రెడ్డితో ఒక యూట్యూబ్ ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా, కించపరుస్తూ చనిపోయే విధంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేశారని తెలిపారు. బాధితుల బంధువులు వెళ్లి ఎందుకు ఇలా చేశావు అని అడిగితే తనను కొట్టడానికి వచ్చారని తప్పుడు ఆరోపణలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని గుల్లం శేఖర్ అనే వ్యక్తి తెలిపాడు.
తమ సమస్యపై గత నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లోనే కూర్చొని మీ వాళ్లతో మాట్లాడుకోవాలని ఎస్ఐ జగన్ చెబుతూ కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. ఉన్నత కులానికి చెందిన వారు కొట్టారని ఫిర్యాదు చేయగానే తమకు చెందిన 11 మందిపై కేసు పెట్టారని, తాము ఇచ్చిన పిటిషన్పై మాత్రం ఎందుకు కేసు నమోదు చేయడం లేదని అడిగితే ఏవో చిన్న సెక్షన్లు పెట్టి ఎఫ్ఆర్ఐ చేశాడన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపడతామని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఎస్ఐ బందోబస్తుకు వెళ్లారని స్టేషన్ సిబ్బంది ఆందోళనకారులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల అనిల్, రావుల నరసింహ, బీరు మల్లయ్య, బాలకృష్ణ, నారి కిష్టయ్య, నారి సత్తయ్య పాల్గొన్నారు.