మోటకొండూర్, జనవరి 4 : 15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా టీకాల అధికారి పరిపూర్ణాచారి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీతోపాటు అమ్మనబోలులో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్, వైద్య సిబ్బంది ప్రవీణ్‌కుమార్, సునంద, దేవావర పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : 15 నుంచి 18 ఏండ్ల వయస్సు వారికి మండల వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మంగళవారం రెండో రోజు కొనసాగింది. 145 మందికి టీకాలు వేసినట్లు డాక్టర్ శివవర్మ తెలిపారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా కట్టడి వ్యాక్సిన్‌తోనే సాధ్యమని వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్ అన్నారు. గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మంగళవారం కరోనా టీకాలు వేశారు. అదే విధంగా మండలంలోని పలు పాఠశాలల్లో వైద్య సిబ్బంది, విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. సర్పంచులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో..
మోత్కూరు : మండలంలో 300 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ గీత తెలిపారు. టీనేజర్లు 65 మందికి, 18 ఏండ్లు నిండిన వారికి మొదటి డోసు 11 మందికి, రెండో డోసు 224 మందికి వేసినట్లు వివరించారు.
రెండో రోజు 3,646 మందికి..
భువనగిరి అర్బన్, జనవరి 4 : 15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ మంగళవారం రెండోరోజు కొనసాగింది. జిల్లా ఆస్పత్రితోపాటు జిల్లాలోని 21 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి టీకా వేశారు. రాత్రి 7.30 గంటల వరకు 3,646 మందికి టీకా వేసినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు.