భువనగిరి కలెక్టరేట్, జూలై 19 : గ్రామస్తులు ఎవరికీ సమాచారం లేకుండా ఏకపక్షంగా ఏర్పాటు చేసిన త్రిలింగేశ్వరస్వామి ఆలయ కమిటీని రద్దు చేసి గ్రామస్తుల సమక్షంలో తిరిగి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండలంలోని తాజ్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కుంభం అనీల్కుమార్రెడ్డికి గ్రామస్తులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా కొనసాగిన ఓరుగంటి నాగయ్యగౌడ్ త్రిలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఉత్సవాల్లో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపించారు. అలాంటి వ్యక్తికి తిరిగి ఆలయ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ అధికారులపై కూడా దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యేకు మాయమాటలు చెప్పి ఆలయ కమిటీ నియామకం చేసుకున్నారని ఇట్టి విషయంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూసి తక్షణమే ఆలయ కమిటీని రద్దు చేయాలన్నారు. గ్రామాభివృద్ధి, ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరి సమక్షంలో గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలయ పాలకవర్గాన్ని నియమించేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ఆరు నెలల క్రితం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అన్నివర్గాల ప్రజల సమక్షంలో త్రిలింగేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీని ఆలయ పూజారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసుకున్నామని, అట్టి కమిటీలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్నారని ఆలయ కమిటీ విషయంలో ఎమ్మెల్యే పునరాలోచించి ప్రజల సమక్షంలో తిరిగి ఆలయ పాలకవర్గాన్ని ఎన్నుకునేలే చర్యలు చేపట్టడంతో పాటుగా దేవాదాయ శాఖ అధికారులపై సమగ్ర విచారణ జరిపించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేయాలని కోరారు.