భూదాన్ పోచంపల్లి, మార్చి 26 : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువు కట్ట వద్ద ప్రమాదాల నివారణకు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ట్రాఫిక్ సిగ్నల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భద్రతా చర్యలను చేపట్టినట్లు తెలిపారు. చెరువు కట్ట మూలమలుపు వద్ద మితిమీరిన వేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడుపుతున్నారని, దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు చెప్పారు.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అతివేగం అనర్ధదాయకమని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, ఎస్ఐ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.