రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట (Rajapet) మండలం నెమిల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నది. మోత్కుపల్లి బాలకిషన్ (33) పచ్చకామెర్లతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని భార్య ఇటీవల వార్డు మెంబర్గా గెలవడంతో ఆ ఎన్నికల బిజీలో అనారోగ్య సమస్యను తీవ్రంగా పట్టించుకోకపోవడంతో మృత్యువు ఒడిలోకి చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే అతని అంత్యక్రియలు కాకముందే మృతుని తండ్రి మోత్కుపల్లి ఐలయ్య (60) గుండెపోటుతో రాత్రి మృతి చెందాడు.
కాగా, గ్రామానికి చెందిన పోతర్ల లక్ష్మి నరసయ్య (60) తన వ్యవసాయ బావి వద్దకు శుక్రవారం సాయంత్రం వెళ్లి తిరిగి రాకపోవడంతో పక్క బావి వాళ్ళు వెళ్లి చూడగా అక్కడే మృతి చెంది ఉన్నాడు. గ్రామంలో ముగ్గురు అంత్యక్రియలు ఒకే రోజు (శనివారం) జరగనున్నాయి. మా గ్రామానికి ఏమైనది? ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి.