యాదగిరిగుట్ట, నవంబర్ 7 : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెరలేపాడు. గుట్టపైన కొత్తగా దుకాణాలకు అనుమతి ఇప్పిస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ దందాలో మొదట 50 లక్షలు.. ఆ తర్వాత మరో రూ.70లక్షల వరకూ చేతులు మారినట్లు తెలుస్తున్నది. చాలదన్నట్లుగా దుకాణాల్లో తనవారికి మూడు షాపులు ఇవ్వాలని కొత్త కిరికిరి పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు యాదగరిగుట్టలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం కొండపైన పూర్వం నుంచే 115 దుకాణాలు నడిచేవి.
ఇందులో కొన్ని టెండర్ల ద్వారా రాగా, మరికొన్ని కమిషనర్లు ఆర్డర్లు ఇచ్చారు. దుకాణదారులంతా సంఘంగా ఏర్పాటై విక్రయాలు సాగించేవారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన క్రమంలో కొండపైన ఉన్న దుకాణాలను తొలగించారు. అనంతరం కొండపైన సరిపడా స్థలం లేకపోవడం భక్తులు ఇబ్బందులు పడుతారని భావించి కొండపైన దుకాణ సముదాయం నిర్మించలేదు. దుకాణదారుల కోరిక మేరకు 10 దుకాణాలకు అనుమతినిచ్చి భక్తుల షాపింగ్‌కు వీలు కల్పించారు. ప్రస్తుతం 10 దుకాణాల నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తం మంది సమానంగా పంచుకుంటున్నారు.
15 దుకాణాలు.. రూ.70లక్షలు!
గుట్టపై మరో 15 షాపులకు కొత్తగా అనుమతులు ఇప్పిస్తానంటూ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఒకరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.50వేల చొప్పున ఇవ్వాలని కండీషన్ పెట్టారట! కొత్త దుకాణాలు వస్తే ఆదాయం పెరుగుతుందని ఆశపడ్డ వ్యాపారులు అంతా కలిసి రూ.70లక్షల వరకు జమ చేసి, సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తున్నది.
టెండర్ల ద్వారా షాపులు కేటాయించాలి
కొండపైన కొత్తగా మరో 15 దుకాణాలు కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంట్లో స్థానికంగా భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు లేకుండా ఇష్టారాజ్యంగా దుకాణాలు కేటాయింపు జరుగుతుందని స్థానికుల్లో అనుమానం ఉంది. టెండర్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా దుకాణాలు కేటాయించాలి.
– కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రూ. కోటిన్నర కోసం.. కొత్త కొర్రీ..!
డబ్బులు పోయినా దుకాణాలు వస్తే ఫాయిదా ఉంటుందని భావించిన వ్యాపారులకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. తొలుత 15 దుకాణాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధి.. ఇప్పుడు 12 దుకాణాలు మాత్రమే ఇప్పిస్తానని, మిగిలిన మూడు దుకాణాలు తన వారికి ఇవ్వాలని షరతు పెట్టారని వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ముందు అన్నీ మాట్లాడాకే డబ్బులిచ్చాం కదా. ఇప్పుడు 3 షాపులకు కోత పెట్టడమేంటి? ఇదెక్కడి న్యాయం’ అంటూ రుసరుసలాడుతున్నారు. ఇదిలా ఉండగా, సదరు నేత ఆ 3 దుకాణాలను సైతం రూ.50లక్షల చొప్పున రూ.కోటిన్నర కోసం బేరం మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దుకాణాల అనుమతికి సంబంధించిన ఫైల్ దేవాదాయ శాఖకు చేరిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే అనుమతి లభించే అవకాశం లభించనుంది. మరోవైపు ఈ వ్యవహారాన్ని అఖిల పక్షం నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించకపోతే కార్యాచరణ రూపొందించి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.