ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 06 : ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆత్మకూర్(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఎన్నికల సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలన్నారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అధిగమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, తాసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములు నాయక్, ఎంఈఓ మహదేవరెడ్డి, ఎంపీఓ పద్మావతి, సూపరింటెండెంట్ లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.