యాదగిరిగుట్ట రూరల్, జనవరి 1 : ‘మద్యం సేవించి వాహనం నడుపడం నేరం’ అని పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరించినా కొంత మంది వాహనచోదకుల్లో మార్పు కనిపించడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధిక ప్రమాదాలు మితిమీరిన వేగం కారణంగానే జరుగుతున్నాయి. జిల్లాలో వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారులతో పాటు ప్రజ్ఞాపూర్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేలా సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో అధిక వేగం, మద్యం సేవించి నడుపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలుగా చర్యలు చేపట్టినా వాహనదారులు మారడం లేదు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపిస్తూ, జరిమానాలు విధిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే సమయంలోనూ మద్యం సేవిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి యాదాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 36మంది పట్టుబడ్డారు. భువనగిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 10, చౌటుప్పల్ పీఎస్ పరిధిలో 15, యాదగిరిగుట్ట పీఎస్ పరిధిలో 11 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
పట్టుబడిన వారికి కౌన్సెలింగ్…
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మద్యం తాగి వాహనం నడిపితే కలిగే అనర్థాలు, రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలు పడే బాధను వివరిస్తారు. మొదటిసారి పట్టుబడితే మద్యం మోతాదును బట్టి జరిమానా, రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచిస్తున్నారు.
2021 సంవత్సరంలో 2068 కేసులు
యాదాద్రి, భువనగిరి జిల్లాలో 2021 జనవరి నుంచి డిసెంబర్ 31వరకు భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 2,068 మంది పట్టుబడ్డారు. కోర్టుకు అప్పగించడంతో రూ.43,64,000 జరిమానా, 353 మందికి జైలు శిక్ష పడింది.
మద్యం తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు..
యాదాద్రి భువనగిరి జోన్ వ్యాప్తంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశాం. వాహనదారులకు అవగాహనతో పాటు మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తూనే ఉన్నాం. డ్రంకెన్ డ్రైవ్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదు. ఒక సారి రోడ్డు ప్రమాదం జరిగితే సదరు వ్యక్తితో పాటు, వ్యక్తి కుటుంబానికి, ఎదుటి వారికీ తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను సరిగ్గా పాటించాలి.