యాదాద్రి, జనవరి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నూతన ప్రధానాలయం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఆలయాన్ని మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభించనుండగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం సప్తతల రాజగోపురాలపై కలశ స్థాపనకు చేపట్టిన స్కాఫ్ హోల్డింగ్(పరంజా) పనులు సాగుతుండగా, పడమటి సప్తతల రాజగోపురానికి బిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలో తూర్పు, ఉత్తరం, దక్షిణ పంచతల రాజగోపురాలను స్కాఫ్ హోల్డింగ్ చేపట్టనున్నారు. 85 అడుగుల సప్తతల రాజగోపురానికి బిగించిన స్కాఫ్ హోల్డింగ్‌ను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఎన్‌వీ రవీందర్రావు, గణపతిరెడ్డి, ఈఓ ఎన్. గీత, టెక్నికల్ కమిటీ, ఇంజినీర్ ఇన్ చీఫ్ కమిటీ మంగళవారం పరిశీలించి సరైనదిగా నిర్ధారించారు. ఆలయ పునః ప్రారంభ సమయంలో సప్త రాజగోపురాలపై కలశాల ఏర్పాటుకు ప్రముఖులు, అర్చకులు, పూజారులు పైకి ఎక్కి విశేష పూజలు చేయనున్నారు. ఈ మహాక్రతువులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దేశవిదేశాల నుంచి రుత్వికులు, వేద పండితులు, దేశంలోని ప్రముఖ దేవాలయ అర్చకులు పాల్గొంటారు. ఈ క్రమంలో కలశ స్థాపనకు రాజగోపురాలను ఎక్కాల్సి ఉంటుంది. సుమారు 50 మంది ఎక్కి విశేష పూజలు చేయాల్సి ఉంటుంది. వీళ్లంతా ఎక్కేందుకు ప్రత్యేకమైన స్కాఫ్ హోల్డింగ్‌ను బిగించారు. క్రతువులు జరిగే క్రమంలో ఇబ్బందులు వాటిల్లకుండాదక్షిణ భారతదేశంలో పేరుగాంచిన స్కాఫ్ హోల్డింగ్ నిపుణులతో బిగింపును చేపట్టారు. ఇందుకోసం చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు మెటీరియల్ తీసుకొచ్చారు. యాదాద్రి ఆలయంలో మొత్తం 7 రాజగోపురాలకు పరంజా ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కాఫ్ హోల్డింగ్ మహా కుంభ సంప్రోక్షణ పూర్తయ్యే వరకు ఉంటుంది.
కొనసాగుతున్న పనులివీ…
ఇప్పటికే స్వామివారి గర్భగుడి ముఖ ద్వారం తలుపులకు బంగారు తొడుగుల పనులు పూర్తి చేశారు. 14 నరసింహ విగ్రహాలు, 36 కమలం పుష్పాలతోపాటు 36 గంటలను అమర్చారు. ద్వార బంధాన్ని చిలుక ఆకృతిలో రూపొందించారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగు పనులు తుది దశకు చేరాయి. మహాద్భుతంగా తీర్చిదిద్దిన స్వర్ణవర్ణపు తొడుగులను ధ్వజస్తంభం పీఠానికి బిగించారు. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చైన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక స్వర్ణ తాపడాలను చేయగా ఇందుకు కావాల్సిన రాగి పనులు మహా బలిపురానికి చెందిన శిల్పి రవీంద్రన్ రూపొందించారు. దీంతోపాటు ధ్వజస్తంభానికి ముందుభాగంలో ఉన్న బలిపీఠానికి బంగారు వర్ణపు తొడుగుల పనులు కొనసాగుతున్నాయి. ఇందు కోసం 1,552 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. కొండపైన ప్రథమ, ద్వితీయ ఘాట్ రోడ్లు కలిసే ప్రదేశంలో 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో రెండు మార్గాలు ఉండేలా స్వాగత ఆర్చి నిర్మాణ పనులు సాగుతున్నాయి. కొండపై ఎస్పీఎఫ్ భవనం, బస్ బే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ పక్కనే క్యూ కాంప్లెక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొండపైకి వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్, కిందికి వచ్చేందుకు మరొక ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. కొండకింద వైకుంఠ ద్వారం నుంచి పాదయాత్రగా వచ్చే భక్తులకు నిర్మించే శ్రీవారి మెట్ల పనులు తుది దశకుచేరాయి. తూర్పు రాజగోపురం ఎదురుగా బిగించిన స్వర్ణవర్ణపు క్యూలైన్లు దాదాపు పూర్తయ్యాయి. లైటింగ్ టెక్నాలజీ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన పసిడి కాంతుల విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేయగా మరింత వెలుతురు కోసం లైట్ల బిగింపు పనులు సాగుతున్నాయి. కొండపై లడ్డూ ప్రసాద విక్రయశాల మానవ రహిత యంత్రాల బిగింపు పూర్తికాగా లడ్డూ తయారీ ట్రయల్ రన్ విజయవంతమైంది.
2022 చరిత్రలో నిలుస్తుంది
2022వ సంవత్సరం యాదాద్రీశుడి ఆలయం చరిత్రలో నిలుస్తుంది. ఈ ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో అతిరథ మహారథుల నడుమ స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు కలుగనుంది. ఇందుకు కావాల్సిన సకల ఏర్పాట్లపై దృష్టి సారించాం. యాగానికి కావాల్సిన స్వచ్ఛమైన నెయ్యి, కలపకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాబోయే రోజుల్లో ఆలయ పరిపాలన విభాగం, ఆలయ సదుపాయాలు, స్వామివారి కైంకర్యాలతోపాటు ఆలయ పునర్నిర్మాణాల్లో ఆటంకం లేకుండా చూసుకుంటాం. ఎప్పటికప్పుడు చినజీయర్‌స్వామి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, మన శాస్ర్తాలు, భక్తుల నమ్మకాలన్నింటినీ క్రోడీకరించుకుని పనులు చేయిస్తున్నారు.
-ఎన్. గీత, కార్యనిర్వాహణాధికారి, యాదాద్రి దేవస్థానం
మార్చిలోపు పనులు పూర్తి..
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని సమీక్షలో అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చాం. కొండపైన ప్రధానాలయంలో లైటింగ్ పనులు పూర్తయ్యాయి. రాజగోపురాలకు కలశ స్థాపనకు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్, రాయగిరి నుంచి ఆలయం వరకు సౌండ్ సిస్టమ్, సీసీ కెమెరా, లైటింగ్‌తోపాటు యాదాద్రి భద్రతా వ్యవస్థను ఈసీఐఎల్ కంపెనీకి అప్పగించాం.
-కిషన్ రావు, వైస్ చైర్మన్, వైటీడీఏ