భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 21 : యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పోచంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యo కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో షెడ్, రైతుల విశ్రాంతి గదుల ఏర్పాటుకు సహకరించాలని రైతులు కోరగా కలెక్టర్ వెంటనే పీఏసీఎస్ సీఈఓ బాల్ రెడ్డికి ఫోన్ చేసి షెడ్, రైతులకు విశ్రాంతి రూమ్ ల ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలో ఈజీఎస్ కింద మొక్కలు పెట్టారని, గతంలో ఇక్కడ పేదలు గుడిసెలు వేశారని, మార్కెట్ షెడ్ ఏర్పాట్లు, రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు స్థలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అభ్యంతరo తెలుపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జలాల్పురంలో నూతనంగా నిర్మిస్తున్న షెడ్ నిర్మాణంలో ఎవరైనా అడ్డంకులకు గురిచేస్తే అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని ఎంపీడీఓకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు తాసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యo కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. జిల్లాలో మంగళవారం నాటికి 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రేపటిలోగా అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ట్యాబ్ ఎంట్రీ చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శైలజ, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్రెడ్డి, ఏఈఓ, నాయకులు ఇబ్రహీంపట్నం అంజయ్య, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, తంగేళ్ల దశరథ, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.