అడ్డగూడూరు, జనవరి 17 : మండలంలోని గట్టుసింగారంలో శుక్రవారం టీబీ రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు డ్రోన్ సహాయంతో పంపినట్లు మండల వైధ్యాధికారి భరత్‌కుమార్ తెలిపారు. అడ్డగూడూరు నుంచి రామన్నపేటకు 53 కిలోమీటర్ల దూరం ఉంటుందని, వాహనంతో పంపిస్తే ఒక గంట 20 నిమిషాలు పడుతుందని, అదే డ్రోన్‌తో 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఆయన చెప్పారు.
గ్రామంలో 11 మంది శాంపిళ్లను సేకరించి పంపినట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రోగుల, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించి తిరిగి రోగులకు అవసరమైన మందులను పంపేందుకు డ్రోన్ సేవలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్సు శారద, సూపర్వైజర్ సరోజన, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.