సంస్థాన్ నారాయణపురం, జూన్ 04 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి సూర్యకళకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లు మంజూరు అయింది. అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా గృహలక్ష్మి మంజూరు పత్రం సైతం అందుకుంది. దీంతో తన సొంత ఇంటి కల నెరవేరబోతుందని సూర్యకళ సంతోష పడింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో గృహలక్ష్మి పథకం నిలిచిపోయింది.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే అర్హురాలిగా తేలడంతో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలోనూ తన పేరు ఉంటుందని ఇప్పటికైనా సొంతిళ్లు నిర్మించుకోవచ్చని కోటి ఆశలతో ఎదురు చూసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలు అందజేశారు. అర్హుల జాబితాలో సూర్యకళ పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది.
శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటున్నానని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే కట్టుకోవచ్చని ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. కొందరు కావాలనే అర్హుల జాబితా నుండి తన పేరును తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాయకుల కక్షో లేక అధికారుల నిర్లక్ష్యమో గానీ సూర్యకళ సొంత ఇంటి ఆశ అడియాశగానే మిగిలిపోతుంది.
Sansthan Narayanapuram : సూర్యకళ సొంతింటి కల అడియాశేనా ?