మోత్కూరు, ఆగస్టు 23 : సిపిఐ అగ్ర నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి శనివారం ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలం కలిగిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఆ భావాలతోనే విద్యాభ్యాసం కొనసాగించారన్నారు. సిపిఐ రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకంగా పనిచేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పదవుల్లో పని చేశారన్నారు. 1998 లో జరిగిన 12వ లోక్ సభ ఎన్నికలకు నల్లగొండ నుంచి మొదటిసారిగా, 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలకు రెండవసారి ఎన్నికై పనిచేశారన్నారు.
1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తాను సిపిఐ నుంచి భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్చార్జిగా ఎన్నికల్లో సురవరం గెలుపు కోసం పని చేసినట్లు చెప్పారు. పాలమూరు జిల్లా బిడ్డ అయినప్పటికీ నల్లగొండ ఎంపీగా గెలిచిన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రజల, రైతుల సమస్యలపై నిరంతరం తనదైన శైలిలో పోరాటం చేశాడని గుర్తు చేశారు. జాతీయస్థాయి నేతగా ఎదిగి ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేశారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు. సురవరం మృతి తీరని లోటు అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పేర్కొన్నారు.