యాదగిరిగుట్ట, మే 28 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో పనిచేసే సురక్షా సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శించి అండగా బుక్కయ్యారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో స్వామివారి ప్రసాదాలకు వినియోగించే చింతపండు బస్తాలను దొంగిలించేందుకు యత్నించారు. ఘటనకు సంబంధించిన వివరాలు దేవస్థాన డీఈఓ దోర్బల భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కొండపైన స్వామివారి ప్రసాద విక్రయశాలలోని గోదాంలో స్వామివారి పులిహోరలో వినియోగించే సుమారు 30 కిలోలు గల 10 బస్తాల చింతపండును సురక్షా సిబ్బంది కన్వేయర్ బెల్ట్ సాయంతో కారులో వేసుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిని చూసి కారుతో పాటు అందులో ఉన్న చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు. ఘటనకు పాల్పడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు.
వీరిపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై దేవస్థానం ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెల్లడించారు. త్వరలో దేవస్థానం ఆధ్వర్యంలో పెట్రోలింగ్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ లేఖ రాసినట్లు తెలిపారు. 24 గంటల పాటు దేవస్థానంతో పాటు టెంపుల్ సిటీ, గోశాల, పుష్కరిణి ప్రాంతాలలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.