రామన్నపేట, జూన్ 30 : రామన్నపేట మండలంలోని సిరిపురం ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికలను రైతులు బహిష్కరించారు. సోమవారం సిరిపురం గ్రామంలోని ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం భవనంలో ఎన్నికల అధికారిగా కందిమల్ల జోగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు చేశారు. మొత్తం 63 ఓట్లు ఉండగా దీనిలో గత పాలకవర్గం అనర్హులైన, పాలు పోయని రైతుల పేర్లు నమోదు చేసి ఓటు హక్కు కల్పించారని, రోజు పాలు పోసే అర్హులకు ఓటు హక్కు కల్పించలేదని ఆరోపిస్తూ రైతులు ఓటింగ్లో పాల్గొనలేదు.
అర్హులైన రైతుల పేర్లను నమోదు చేసి ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ముందు తమకు న్యాయం చేయాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పాల సంఘంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని నినందించారు. ఓటు హక్కును ఎవరూ వినియోగించుకోక పోవడంతో పాలకవర్గ కమిటీని రద్దు చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.