– గొర్రెల బీమా, మార్కెట్ యార్డుల ఏర్పాటుకు విజ్ఞప్తి
– యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– మాజీ మంత్రి హరీష్‌రావుకు వినతి
బీబీనగర్, మార్చి 25 : రాష్ట్రంలో గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించి పరిష్కార చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వేలాది కుటుంబాలు సాంప్రదాయంగా గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గొర్రెల పెంపకం కీలక వృత్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కాపరులు అనేక ఆర్థిక, ఆరోగ్య, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గొర్రెలకు ప్రత్యేక బీమా సదుపాయం కల్పించి, చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి రెండు మండలాలకు ఒక గొర్రెల, మేకల మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని, పశు సంవర్ధక శాఖలో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించాలని తెలిపారు. యాదవుల అభివృద్ధికి ప్రత్యేక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన నట్టల మందు క్రమం తప్పకుండా అందించాలని, ప్రతి మండలం, గ్రామీణ ప్రాంతాల్లో వెటర్నరీ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. గొర్రెల కాపరుల పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేశబోయిన సూర్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షుడు జల్లి నర్సింహులు కురుమ, ప్రధాన కార్యదర్శి సోము రమేశ్ కురుమ, దేశబోయిన నర్సింహా, కోమల్ల కుమార్, నక్కల చిరంజీవి యాదవ్ పాల్గొన్నారు.