భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 13 : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 500 పైచిలుకు సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లేదని తెలిపారు. ఏదైనా ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కనీస ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు పీఆర్టీయూ తెలంగాణ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ రేపాక గిరిధర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లేశ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బో య రాములు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కడెం సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మల్ల వెంకన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి, జాతీయ నాయకులు మంద శంకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశ్, గ్రామపంచాయతీ యూ నియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొత్త యాదమ్మ మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిలా అధ్యక్షుడు మంగ పాండరి, జిల్లా నాయకులు కర్ణాకర్, శిరీష, బొల్లెపల్లి స్వామి, మోహనా చారి, పొన్నాల రేణుక, సంధ్యారాణి, చందర్, భవాని, రవీందర్‌రెడ్డి, జహంగీర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.