బీబీనగర్ : రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోని అధిక దిగుబడి సాధించేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అధ్యక్షతన వానాకాలం పంటలపై ఏఈవోలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
కలెక్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ రైతు బీమా, రుణ మాఫీ, రైతుబంధు వంటి పథకాలపై విస్తృత అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాలలో పండించే పంటల వివరాలను రైతు వారీగా నమోదు చేసుకుని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అప్లోడ్ చేయాలన్నారు.
ఈ నెల 12 వ తేదీ లోగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులను గుర్తించి రైతుబీమా ప్రయోజనం చేకూరేలా నమోదు చేయించాలన్నారు. ప్రతి వ్యవసాయ అధికారి ఒక రైతును విధిగా దత్తత తీసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. అదేవిధంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరెవుల వైపు రైతు దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు.
అనంతరం చీడ పీడల నివారణపై డాట్ సెంటర్ సైంటిస్టు నరేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ ఏఈవోలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఏలు భుక్యా దేవ్‌సింగ్, పద్మావతి, వెంకటేశ్, బీబీనగర్ ఎంఏవో పద్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు, పాల్గొన్నారు.