భువనగిరి అర్బన్, మే 29 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీ, పీఎన్డీటీ చట్టానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, సరైన రికార్డులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లెవల్ అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 57 స్కానింగ్ సెంటర్లు ఉండగా 41 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపారు. 16 స్కానింగ్ సెంటర్లు వివిధ కారణాల వల్ల పని చేయడం లేదన్నారు.
జిల్లాలో మార్చి నెలలో జరిపిన ప్రత్యేక డ్రైవ్లో చట్టం ప్రకారం రికార్డుల నిర్వహణ, నిబంధనల అమలు తీరును తనఖి చేశామని, ఈ తనిఖీల్లో అనుమతులకు విరుద్దంగా ఉన్నవాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు. చట్టాలపై విద్యార్థులు, గర్భిణులు, బాలితంలకు అంగన్వాడీ, స్థానిక సంస్థ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో లింగ నిర్థారణ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి.మాలతి, కమిటీ సభ్యులు కవిత, అరుందతి, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.