– న్యాయం చేయాలని రజక కులస్తుల డిమాండ్
యాదగిరిగుట్ట, ఆగస్టు 23 : వారసత్వంగా కౌలు రైతుల హక్కుల చట్టం కింద సర్వే నంబర్ 373 సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు తెలియకుండానే కొంత మంది గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించారని బాధిత రజక కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు అదే భూమిపై తమకు తెలియకుండానే తిరిగి హక్కుల కోసం కోర్టులో కేసు వేసినట్లు వాపోయారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో రజక కులస్తులు కొమ్మరాజు చంద్రయ్య, కొమ్మరాజు లక్ష్మయ్య, గడసంతల మల్లేశం, కొమ్మరాజు సత్యనారాయణ, వడ్లకొండ బుచ్చాలు, గడసంతల శేఖర్ శనివారం విలేకరుల సమావేశంలో తమ గోడు వెల్లబోసుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు 2015లో నాలుగు డ్యాకుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించి, డబ్బులు దండుకుని అసలు వారసులైన తమకు తీరని అన్యాయం చేసినట్లు తెలిపారు.
దీంతో పాటు తమకు తెలియకుండా రజక కులస్తులైన 27 మందిలో 15 మంది రజక కులస్తులపై 12 మంది కోర్టులో ఫోర్జరీ సంతకాలను సృష్టించి తిరిగి ఆదే భూమిపై కేసు వేశారని తెలిసి ఆశ్చర్యానికి లోనైనట్లు చెప్పారు. ఇంత జరుగుతున్నా తమకు తెలియలేదని, ఇటీవల కోర్టులో విచారించగా కేసులు వేశారన్న విషయం బహిర్గతం అయినట్లు వెల్లడించారు. వారికి తెలియకుండానే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సొంత అన్నదమ్ముల మీదనే కేసులు వేసిన్నట్లుగా గందరగోళాన్ని సృష్టించి, రజక కులస్తుల మద్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఫోర్జరీ సంతకాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కొంతమంది బ్రోకర్లు తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. 47 ఎకరాల భూమిపై హక్కులను సాధించేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఫోర్జరీ సంతకాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం ఆగదని పేర్కొన్నారు.