– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి
బీబీనగర్, డిసెంబర్ 29 : జిల్లాలో గొర్రెల పెంపకమే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అయితే వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గొర్రెల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దేశబోయిన సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హనుమంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం సీజన్ వారీగా వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించి సంవత్సరానికి నాలుగు సార్లు మందుల సరఫరా చేయాలని, ముఖ్యంగా మూతి పుండు వాపు, డెక్క వాపు వంటి వ్యాధులకు అవసరమైన మందులను నిరంతరం అందించాలని కోరారు.
గ్రామాల్లో కుక్కల దాడులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేలాది గొర్రెలు మృతి చెందాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నష్ట పరిహారం అందలేదన్నారు. నష్టపోయిన కుటుంబాలు ప్రభుత్వ ఆదరణ లేక రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గొర్రెలకు ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల పెంపకదారులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అమలు చేయాలని కోరారు. పదవీకాలం ముగిసి సంవత్సరాలు గడుస్తున్న గొర్రెల పెంపకం సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఎన్ఎల్ఎం స్కీమ్ నిబంధనలను సరళతరం చేయాలని, సన్న-చిన్నకారు రైతులకు 100 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేశ్ కురుమ, సభ్యులు జహంగీర్ యాదవ్, జూకంటి ఉప్పలయ్య, చుక్కల బాలయ్య, అబ్బ సాయిలు, గాజుల చంద్రయ్య పాల్గొన్నారు.