మోత్కూరు, ఆగస్టు 05 : రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అనారోగ్యం కారణంగా స్వగ్రామం దత్తప్పగూడెంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను టీవీలో వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కక్ష సిద్ధాంతంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు లభిస్తున్నదన్న వాస్తవాన్ని నిరాకరించి, ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ వేలాది ఎకరాలు సాగునీటి కిందకు వచ్చినట్లు తెలిపారు. కానీ ఈ నిజాలను గాలికి వదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తుండడం బాధాకరం అని పేర్కొన్నారు.