ఆత్మకూరు (ఎం), అక్టోబర్ 21 : సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరులకు పౌర సమాజం ఘన నివాళులర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) పోలీసులు, నక్సలైట్లు, సిమి ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో పలువురు పోలీసులు ప్రాణత్యాగం చేశారు. 2006 ఆగస్టు 18న ఆత్మకూర్ (ఎం) పోలీసు స్టేషన్ పై నక్సలైట్లు దాడి చేశారు. ఈ సంఘటనలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సుల్తాన్ మొయినుద్దీన్, కానిస్టేబుల్ కరీం, హోంగార్డు లింగయ్య కన్నుమూశారు. అలాగే 2015 ఏప్రిల్ 4న మోత్కూరు మండలం జానకిపురంలో సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ చౌగోని నాగరాజు వీరమరణం పొందారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ మంగళవారం పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఇన్చార్జి ఎస్ఐ సతీశ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సైదులు, సిబ్బంది మల్లేశ్, సైదా, ప్రియాంక, హుస్సేన్, సుధాకర్, విజయ్ పాల్గొన్నారు.