భూదాన్ పోచంపల్లి, మార్చి 26 : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి పోచంపల్లి పట్టు వస్ర్తాలను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవానికి పోచంపల్లి వస్త్రాలు నేయడాన్ని దేవస్థానం ఈఓ రమాదేవి బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఎస్ ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో పోచంపల్లి చేనేత కళాకారులు కడవేరు చంద్రశేఖర్, ఆడేపు ఆంజనేయులు, ఇంజమూరి యాదగిరి, దోర్నాల శ్రీనాథ్ పట్టు వస్త్రాలను నేయనున్నారు. పట్టు వస్త్రాలను తయారు చేసి ఏప్రిల్ 4న ఎదుర్కోలు కార్యక్రమంలో జయరాజ్ ఆధ్వర్యంలో ఈఓ రమాదేవికి పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను అందజేయనున్నారు.