బీబీనగర్, ఏప్రిల్ 12 : జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామం. కానీ బస్సులు మాత్రం ఆగడం లేదు. దీంతో బీబీనగర్ మండలంలోని గూడూరులో బస్ స్టాప్ కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 4 వేల జనాభా కలిగిన గూడూరు గ్రామానికి బస్సులు ఆపకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో బస్ స్టాప్ లేకపోవడంతో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామంలో పోరాట సమితిగా ఏర్పడి గత మూడు రోజులుగా బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గతంలో గూడూరు గ్రామానికి రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉండి బస్సులు ఆగేవని గ్రామస్తులు తెలిపారు. అయితే మహిళలకు ఉచిత బస్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత గూడూరు వద్ద బస్సులు ఆపడం తగ్గిపోయిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం గూడూరు గ్రామస్తులను బీబీనగర్ లేదా అనంతారం వద్ద బస్సు దింపుతున్నారని, దీంతో రోజూ ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో దింపడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో బస్సులు ఆపకపోవడం వల్ల మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి గూడూరు గ్రామంలో బస్సులు ఆపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని భావోద్వేగంగా సంతకాలు చేస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.